అక్టోబర్ 16, 2006 వద్ద 10:40 పూర్వాహ్నం (నా రాతలు)
లేని నిన్నటి కన్న
రాని రేపటి కన్న
ఉన్న నేడే మిన్న
ఓ కూనలమ్మ!
ఒకటి ఒకటీ రెండు
పూలు కలిపితె చెండు
కలసి మెలగుటె మెండు
ఓ కూనలమ్మ!
మంచి మమతల మనసు
ఎపుడు వాడని సొగసు
స్థిరము కాదీ వయసు
ఓ కూనలమ్మ!
శాంతి సహనము లొలికి
ప్రేమ సుధలను చిలికి
మధుర మగునే మనికి
ఓ కూనలమ్మ!
చేయి చేయీ కలుపు
కృషిని వీడక సలుపు
తుదకు నీదే గెలుపు
ఓ కూనలమ్మ!
1 వ్యాఖ్య
అక్టోబర్ 8, 2006 వద్ద 6:06 అపరాహ్నం (నచ్చిన కవితలు, నా రాతలు)
చిన్ని చిన్ని పాపలు చిన్నారి పాపలు
ముద్దు మీ మోముల నిండాలి కాంతులు !
క్షణమాగని కాలంలో పండుతాయి మీ కలలు
ఆ నాడే నిండుతాయి జగమంతా నవ్వులు!!
కల్లాకపటం లేని ఈ చిన్ని మనసులే
మోసం ద్వెషం లేని నవ సమాజ శిల్పులు
జీవన చైతన్యపు సౌదానికి పునాడులు
చిట్టి చిట్టి అడుగుల బుడి బుడి ఈ నడకలే
కులమతాల పేరు లేని నవ్య కాంతి రేఖలు
క్రొంగొత్త లోకాలకు బాటలేయు దారులు!
పసితనపు పరిమలాల విరబూయు నవ్వు పూలు
నిలుపుతాయి నేరాలు జయిస్తాయి వేదనలు
పెంచుటాయి మమతలు కలుపుతాయి మనసులు !
మేఘాలే కురుస్తాయి ఆనంద వర్షాలు
ప్రేమ సెలయేరులే త్రొక్కుతాయి పరవళ్ళు
క్షణమాగని కాలంలో పండుతాయి మీ కలలు
ఆ నాడే నిండుతాయి జగమంతా నవ్వులు!
1 వ్యాఖ్య