నవంబరు 14, 2006 వద్ద 3:30 అపరాహ్నం (నచ్చిన కవితలు, నా రాతలు)
తన సిరిని నేనంట
విరి నవ్వు నాదంట
వెన్న లాంటి మనసు వాడు
యెన్నెలంటి చూపు వాడు
నా సామిని తలచుకుంటె
నా ఎడద తో పాటె
ఎసరు కూడ పొంగింది
యేడి యేడి బువ్వొండి
తన చేతిలో చెయ్యేసి
ముద్ద ముద్ద చేసి పెట్టి
చివరి ముద్ద నాదంటూ
కొసరి కొసరి తినిపించి
కొంగు తోన మూతి తుడిచి
నా వెన్నెల ఈడేనంటూ
నా సామి ఒళ్ళోన
హాయిగా తలను పెట్టి
తన వేళ్ళు నా తలను
వెచ్చగా నిమురుతుంటె
కళ్ళలోన కళ్ళు పెట్టి
చూపు లోన చూపు కలిపి
కబురులేవి చెప్పలేని
ఊసులన్ని ఆడేసి
చల్లగా నిదరోతా
తన ప్రేమకు నే మురిసి !!
అభిప్రాయములు
నవంబరు 10, 2006 వద్ద 9:51 పూర్వాహ్నం (నా రాతలు)
నీ స్నేహ మాధురిలో ఝరిలో
తనిచి తడిసి నేను..
నీ నవ్వుల వెన్నెలలో అలలో
విరిసి మురిసి నేను..
నీ మనసు ముంగిలిలో చలిలో
నిలిచి వేచి నేనూ…
అభిప్రాయములు
నవంబరు 3, 2006 వద్ద 10:40 పూర్వాహ్నం (నా రాతలు)
దీపాల పండుగ వచ్చింది
వెలుగుని అంతట నింపింది
మూల మూలల్లో మూల్గుతు ఉన్న
చీకట్లను తరిమివేసింది
సందుగొందుల్లోను
ప్రతి ఇంతి ముందును
అక్కడ ఇక్కడ ఎల్ల చోట్లను
కాంతి వెల్లువై పొంగింది
ఆనంద నృత్యం చేసింది
తన చిన్ని వెలుగుతో ఒకొక్క దివ్వె
తన చుట్టు నిశి కొంత మాయం చేసింది
చిన్ని వెలుగులన్ని కలిసేసరికి
చీకటి ఓడిపొయింది , దూరంగ పారిపోయింది
దివ్వె దివ్వె కలిసి దీపోత్సవం
మనసులెల్ల మురిసి మహోత్సవం
చేయి చేయి కలిపితె మనమందరం
నవ్వులన్ని కలిపి నవ్యోత్సవం
వ్యాఖ్యానించండి
నవంబరు 2, 2006 వద్ద 9:21 పూర్వాహ్నం (నచ్చిన కవితలు, నా రాతలు)
ఎన్నాళ్ళో ఈ శిశిరము
కళాహీనమాయె వనము
ఎన్నాళ్ళో ఈ శిశిరము
రాగ హీనమాయె మనము ..
ఆకు ఆకు నేల రాలి
ధూళి కలిసి పోయేనో
రెమ్మ రెమ్మ చిగురు లేక
నీరసించి వాడేనో
కొమ్మ కొమ్మ మోడువారి
అలసి కలయజూచేనో .. ఎన్నాళ్ళో…
నీ వెచ్చని స్పర్శ లేక
చలికి వణికి వణికి సోలి
రాగ జీవ ధార లేక
నీరసించి సొమ్మసిల్లి
వేచితినో వనమాలీ
నీ రాకయె చైత్రమనుచు
వేడుచుంటి బ్రతిమాలీ
నన్ను బ్రోవ రమ్మనుచు .. ఎన్నాళ్ళో…
అభిప్రాయములు