పూల హారం వాడిపోయింది
తోవ లోనే పళ్ళు దొర్లిపోయినాయి
వీణ పగిలిపోయింది
నిన్ను పిలిచే నా కంఠ స్వరం
నా చెవులకే వినిపించడం మానింది
ఎన్ని పగళ్ళు రాత్రులు నడిచినా
ఎడతెగని అడవి
దూరాన మసకలో కనపడీ
కనపడని కోట బురుజులు
ఎంతకీ చేరువ కాని సౌధదుర్గాలు..
నాకిక తోవ లేదు
తలుపులు మూసేసారు
వెనక్కి వెళ్ళినా, ఇక్కడే
తిరిగి తిరిగి నశించినా
ఆనాడు రమ్మన్న నీ మధుర స్వరం నన్ను విడువదు
నీలో తప్ప నాకు లోకంలో చోటు లేదు
నీ ఆలింగనంలో తప్ప నాకు శాంతి లేదు
దూరంగా ఆకాశంలో ఉండుండి మెరిసే
నీ ఆకాశ దీపమొక్కటే గుర్తు
ఈ చీకట్లో గాలిలో నిముషం వినిపించే
నీ వీణరవమే పిలుపు
నువ్వే గతి!
నాకిక శక్తి!
~~~
రాసిందెవరో తెలియకపోయి ఉంటే, రవీంద్రుని కవితకి తెలుగు అనువాదమని అనుకుని ఉండేదాన్ని. కాని, ఈ నివేదన గీతాంజలిని తెనిగించిన చలం మదిలోనుంచి జాలువారినది!