స్వేఛ్చ కావలె …

స్వేఛ్చ కావలె స్వేఛ్చ కావలె
స్వేఛ్చ కావలె ఈ విపంచికి
సంకుచిత భావాల చెరవిడి
సమసమత్వపు నింగికెగరగ …

అహము భారము అంతరించగ
తేలి రయ్యన ఎగిరిపోగా
అంతరంగము అందమరయగ
తూలి మబ్బుల ఆడుకొనగ … స్వేఛ్చ కావలె ఈ విపంచికి!

తొలి ఉషస్సుల సందె వెలుగుల
తనదు గానము ఆలపించగ
రాజబాటల ముళ్ళదారుల
తన విహారముననుభవించగ… స్వేఛ్చ కావలె ఈ విపంచికి!

శిధిలాలయం

శిధిలాలయమ్ములో
శిలగానె మిగిలావ దేవా…

ప్రేమ దీపము లేక
శాంతి గంధము లేక
అంతర్వివేచనల
నిత్యార్చనలు లేక
శిధిలమైనట్టి ఈ
హృదయాలయమ్ములో
శిలగానె మిగిలావ దేవా…
నా వినతులాలించి
నీ కరుణ సారించి
ప్రాణమ్మునే మరల తేవా …

వెన్నముద్దలు

జనార్ధన్ మహర్షి గారి “వెన్నముద్దలు” నుంచి మచ్చుక్కి రెండు ..

చెట్టుని నరికేశారు
భోరుమంది
నీడ లేకుండా పోయానని
ఆ కన్నీరుకి
వేర్లు తడిశాయి
మొక్కలు మొలిచాయి
మళ్ళీ గొడ్డలి సిధ్ధం …

~~~

ఒకటే చూసే రెండు కళ్ళు
ఒకదానినొకటి చూసుకోవు.
ఎప్పుడు కలిసే ఉండే పెదాలు
ఒక్క మాటలో విడిపోతాయి.

అందుకే ..
కళ్ళకి ధ్యానం కావాలి
పెదాలకి మౌనం కావాలి ..

వెదురుగా పుట్టాక …

వెదురుగా పుట్టాక వేణువయ్యేదాక
ఈ వెతలు దేనికే, ఈ వేదనెందుకే ?
ఏ వేలి మృదుకొనలు నిను బ్రోచు ఆ వేళ
నిను తాకి ప్రతి గాలి రాగమయ్యే వేళ
ఎప్పుడొచ్చునో అని వేచి చూచే కన్న
వేసారి అలపుతో వగచి వాడే కన్న
నీ సడిని మెల్లగా ధ్వనియింప చేయుమ
వేడి గాలులనన్ని వెత తీర్చి పంపుమ !

నేనే ఎంకినైతే ..

తన సిరిని నేనంట
విరి నవ్వు నాదంట
వెన్న లాంటి మనసు వాడు
యెన్నెలంటి చూపు వాడు
నా సామిని తలచుకుంటె
నా ఎడద తో పాటె
ఎసరు కూడ పొంగింది
యేడి యేడి బువ్వొండి
తన చేతిలో చెయ్యేసి
ముద్ద ముద్ద చేసి పెట్టి
చివరి ముద్ద నాదంటూ
కొసరి కొసరి తినిపించి
కొంగు తోన మూతి తుడిచి
నా వెన్నెల ఈడేనంటూ
నా సామి ఒళ్ళోన
హాయిగా తలను పెట్టి
తన వేళ్ళు నా తలను
వెచ్చగా నిమురుతుంటె
కళ్ళలోన కళ్ళు పెట్టి
చూపు లోన చూపు కలిపి
కబురులేవి చెప్పలేని
ఊసులన్ని ఆడేసి
చల్లగా నిదరోతా
తన ప్రేమకు నే మురిసి !!

నీ స్నేహ మాధురిలో

నీ స్నేహ మాధురిలో ఝరిలో
                   తనిచి తడిసి నేను..
నీ నవ్వుల వెన్నెలలో అలలో
                   విరిసి మురిసి నేను..
నీ మనసు ముంగిలిలో చలిలో
                   నిలిచి వేచి నేనూ…

దీపావళి

దీపాల పండుగ వచ్చింది
వెలుగుని అంతట నింపింది
మూల మూలల్లో మూల్గుతు ఉన్న
చీకట్లను తరిమివేసింది

సందుగొందుల్లోను
ప్రతి ఇంతి ముందును
అక్కడ ఇక్కడ  ఎల్ల చోట్లను
కాంతి వెల్లువై పొంగింది
ఆనంద నృత్యం చేసింది

తన చిన్ని వెలుగుతో ఒకొక్క దివ్వె
తన చుట్టు నిశి కొంత మాయం చేసింది
చిన్ని వెలుగులన్ని కలిసేసరికి
చీకటి ఓడిపొయింది , దూరంగ పారిపోయింది

దివ్వె దివ్వె కలిసి దీపోత్సవం
మనసులెల్ల మురిసి మహోత్సవం
చేయి చేయి కలిపితె మనమందరం
నవ్వులన్ని కలిపి నవ్యోత్సవం

ఎదురుచూపు

ఎన్నాళ్ళో ఈ శిశిరము
కళాహీనమాయె వనము
ఎన్నాళ్ళో ఈ శిశిరము
రాగ హీనమాయె మనము ..

ఆకు ఆకు నేల రాలి
ధూళి కలిసి పోయేనో
రెమ్మ రెమ్మ చిగురు లేక
నీరసించి వాడేనో
కొమ్మ కొమ్మ మోడువారి
అలసి కలయజూచేనో .. ఎన్నాళ్ళో…

నీ వెచ్చని స్పర్శ లేక
చలికి వణికి వణికి సోలి
రాగ జీవ ధార లేక
నీరసించి సొమ్మసిల్లి
వేచితినో వనమాలీ
నీ రాకయె చైత్రమనుచు
వేడుచుంటి బ్రతిమాలీ
నన్ను బ్రోవ రమ్మనుచు .. ఎన్నాళ్ళో…

కూనలమ్మ పదాలు …

లేని నిన్నటి కన్న
రాని రేపటి కన్న
ఉన్న నేడే మిన్న
ఓ కూనలమ్మ!

ఒకటి ఒకటీ రెండు
పూలు కలిపితె చెండు
కలసి మెలగుటె మెండు
ఓ కూనలమ్మ!

మంచి మమతల మనసు
ఎపుడు వాడని సొగసు
స్థిరము కాదీ వయసు
ఓ కూనలమ్మ!

శాంతి సహనము లొలికి
ప్రేమ సుధలను చిలికి
మధుర మగునే మనికి
ఓ కూనలమ్మ!

చేయి చేయీ కలుపు
కృషిని వీడక సలుపు
తుదకు నీదే గెలుపు
ఓ కూనలమ్మ!

చిన్ని చిన్ని పాపలు …

చిన్ని చిన్ని పాపలు చిన్నారి పాపలు
ముద్దు మీ మోముల నిండాలి కాంతులు !

క్షణమాగని కాలంలో పండుతాయి మీ కలలు
ఆ నాడే నిండుతాయి జగమంతా నవ్వులు!!

కల్లాకపటం లేని ఈ చిన్ని మనసులే
మోసం ద్వెషం లేని నవ సమాజ శిల్పులు
జీవన చైతన్యపు సౌదానికి పునాడులు
చిట్టి చిట్టి అడుగుల బుడి బుడి ఈ నడకలే
కులమతాల పేరు లేని నవ్య కాంతి రేఖలు
క్రొంగొత్త లోకాలకు బాటలేయు దారులు!

పసితనపు పరిమలాల విరబూయు నవ్వు పూలు
నిలుపుతాయి నేరాలు జయిస్తాయి వేదనలు
పెంచుటాయి మమతలు కలుపుతాయి మనసులు !

మేఘాలే కురుస్తాయి ఆనంద వర్షాలు
ప్రేమ సెలయేరులే త్రొక్కుతాయి పరవళ్ళు
క్షణమాగని కాలంలో పండుతాయి మీ కలలు
ఆ నాడే నిండుతాయి జగమంతా నవ్వులు!

కొత్త టపాలు »