మాఘమాసం

కొమ్మల గుండా జారి
మొగ్గలకి రంగులద్ది
లోలోని చిగుళ్ళని
పరిపుష్ఠం చేస్తోంది
మాఘమాసపు వెచ్చదనం !

             ***

తమ యవ్వనపు కథలన్నింటిని
గలగలలాడుతూ దొర్లుతూ
పంచుకుని మురిసిపోతున్నాయి
ఎండిపోయిన పండుటాకులు !

ప్రకటనలు
Posted in నా రాతలు | వ్యాఖ్యానించండి

మనుషులంటే మరలు కాదోయ్

కలిమి కీర్తుల వెనుక పరుగిడి
అలసి వగచే మదిని సైతము
మూల త్రోసి మట్టు పెట్టి
మమత మరచి మరగ మిగిలి
మనిషి తానని మరచిపోయి
మానవత్వం మంట కలిపే
వ్యర్ధ జీవులకేది పేరు?

కష్టసుఖముల ఓర్పు విడువక
కలిమి లేముల నీతినొదలక
సాటి మనిషిపై ప్రేమ నిండిన
మనశ్శాంతియే సిరిగ తలచిన
మనిషె మనిషి నిజముగాను !

మనుషులంటే మరలు కాదోయ్
మమత నిండిన మనసులోయ్ !!

Posted in Uncategorized | 1 వ్యాఖ్య

ఎటు చూడను, నా నేస్తం?

నువ్వు మూగవయ్యాక
నాకు పాట ఎక్కడిది?
నీ స్నేహం జారాక
నాకు శాంతి ఎక్కడిది ?

ఏవేవో అలజడులు
దిశ తెలియని పెనుగాలులు
నమ్మకాన్ని తుడిచేస్తే
ప్రేమ దివ్వెనార్పేస్తే

నువ్వు కనుమరుగైపోతే
నాకు నేనే కరువైతే

నీళ్ళు ఎండిన కనుదోయితో
నేనెటు చూడను, నా నేస్తం?
నీకై… చాచి ఉంచిన ఈ చేత్తో
ఇంక … ఏమి చెయ్యగలను, నా ప్రాణం?

 

Posted in నా రాతలు, నువ్వు-నేను, స్నేహం | 2 వ్యాఖ్యలు

కాలానుభుతూలకు అతీతంగా …

(మామూలు మట్టికీ ఉంటుందేమో స్పందన !)

రోడ్డు రోలరు తొక్కుకుంటూ పోయింది
రాళ్ళని తనలోకి నొక్కేస్తూ, కుక్కేస్తూ
ఒక్క పిసరైనా ఖాళీ లేకుండా..

తళతళలాడే తారు రోడ్డైపోయింది తను
మీద వెళ్ళే వాళ్ళ వేగానికి
తన ఎగుడుదిగుళ్ళు అడ్డు రాకుండా …

ఇప్పుడే అడుగులేస్తున్నచిట్టి పాపలో
జల్లుకి తలలెత్తే గడ్డి పువ్వులో
తన దగ్గరకి వచ్చే ఊసే లేదిక …

చక్రాల దొర్లుడే ఇక పారిజాతాల స్పర్శ
పొగలూ గిగలే చంద్రకాంతాల సువాసన
వానైనా, ఎండైనా అన్నీ ఇక ఒకటే …

కాలాలకూ, అనుభుతూలకూ అతీతంగా
తళతళలాడే తను !
అందరికీ ఉపయోగపడేలా చక్కగా
నిగనిగలాడే తను !!

Posted in నా రాతలు | Tagged , , | 1 వ్యాఖ్య

నా చిట్టి వర్ష

కలువల్ల కన్నుల్ల పాపాయి ఎవరు?
నా చిట్టి వర్ష …

తేనెల్ల పలుకుల్ల చిన్నారి ఎవరు ?
నా చిన్ని వర్ష …

మబ్బుల్ల బుగ్గల్ల అమ్మాయి ఎవరు?
నా బుల్లి వర్ష …

వెన్నెల్ల నవ్వుల్ల బుజ్జాయి ఎవరు?
నా బుజ్జి వర్ష …

Posted in చిట్టి-పాటలు, నా రాతలు, పిల్లలు | 1 వ్యాఖ్య

నా నానీలు

చెంపలు జారినవి
రెండు చుక్కలే.
మనసు లోపల
ఎన్ని ముక్కలో!

~~~

బరువుల్ని
తల’లో’కెత్తుకుంటే,
చాలా రుసుములు
చెల్లించాల్సొస్తుంది.

~~~

నాకంతా నువ్వే
అన్నాను…
నీ కళ్ళలో
నిండుగా నేను…

~~~

అనుభవం
దారి చూపిస్తే చాలు.
వేలు పట్టుకుని
నడిపించక్కర్లేదు!

~~~

పొంగినా, పొరలినా
జారినా, జాలువారినా
మారేది రూపమే!
స్వరూపం కాదు.

~~~

గుండె గది
కాస్త ఖాళీ చెయ్యవూ?
షోకేస్ లోనుంచి
వచ్చేస్తా వెనక్కి…

~~~

లోపలంతా వెతికాను
లేనే లేదు!
కొని తెచ్చుకోబోతున్నా
అందాన్ని…

~~~

ఇల్లు ఇరుకురా
అన్నాడు మొహమాటంగా..
ఇల్లాలు కాదుగా?
అన్నాను నవ్వుతూ.

Posted in నచ్చిన కవితలు, నా రాతలు | 2 వ్యాఖ్యలు

తేడా ఎక్కడ?

అవే చెట్లు … 
నా లోని సంతోషానికి 
తలలూపుతున్నట్లు … 
 
అదే ఊపు … 
నా లోని సంఘర్షణలకి 
అద్దం  పడుతున్నట్లు  … 
Posted in నా రాతలు | వ్యాఖ్యానించండి