ప్రభు నువ్వే నువ్వే

అంతటా అన్నిటా ప్రభు నువ్వే నువ్వే

అణువూ అణువువై నువ్వే విడివడి
భిన్న రూపాలలో మళ్లీ కలిసి
సుందర జగమే రంగస్థలిగా ॥ అంతటా ॥

సంద్రం నుంచి ఎగసే కెరటమై
ఉరిమే మేఘమై కురిసే వర్షమై
నదులూ చెరువులూ జలపాతాలుగా
ఎన్ని రూపాలున్నా అది నువ్వే నువ్వే ॥ అంతటా ॥

మట్టిలో రేణువై మహా పర్వతమై
విత్తులో సారమై విష కంటకమై
శాంతివై కాంతివై మహా ప్రళయమై
ఎన్ని రూపాలున్నా అది నువ్వే నువ్వే ॥ అంతటా ॥

ప్రకటనలు
Posted in నా రాతలు, భక్తి | 1 వ్యాఖ్య

నేనూ ఎదుగుతా!

వాళ్ళకి నచ్చినంత ఎత్తుకే  ఎదగాలి
వాళ్ళకి నచ్చిన ఆకృతిలో ఒదగాలి
ముదిరిన మొదళ్ళని దాచుకుంటూ
లేతగానే కనిపించాలి,
మురిపించాలి …
దేన్నీ స్వేచ్ఛగా ఎదగనివ్వరా?

Posted in నా రాతలు | వ్యాఖ్యానించండి

“సహజ” పాటలు – నా పాట్లు

మా బంగారుతల్లి పేరు సహజ. మొన్నమొన్ననే పుట్టినట్లు నాకు అనిపిస్తూ ఉన్నా, తనకి అప్పుడే సంవత్సరం దాటి 4 నెలలు అయిపోయింది. సహజకి పాటలంటే చాలా ఇష్టం – బుద్ధిగా, శ్రధ్ధగా వింటుంది. నిద్రపోవడానికి, బువ్వ తినడానికి, స్నానం చెయ్యడానికి అన్నింటికీ పాటలే, పాటలు. నా పాటల్ని వినే ఒక ప్రాణి దొరికినందుకు నాకు, వినటానికి తనకి చాలా ఆనందంగా, సరదాగా ఉండేది. తనకి మాట్లాడటం వచ్చిన దగ్గర నుంచి పాటల్ని కూడా పాడెయ్యటానికి ప్రయత్నిస్తోంది. “ఆకులో ఆకునై”, “లాలీ లాలీ” లాంటి పాటల్ని మనం కొంచెం అందిస్తే 3-4 లైన్లు పాడేస్తుంది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది గానీ, ఈ మధ్య ఒక పాట మొదలుపెట్టగానే ఠక్కున తల అడ్డంగా తిప్పుతూ “వద్దు” అనేస్తోంది. “మళ్ళీ”, “మళ్ళీ” అని ముద్దుగా అడిగే నా బంగారుతల్లి అలా అనగానే “నాకు బోలెడు పాటలొచ్చు” అనే పేద్ద అపోహ దెబ్బకి ఎగిరిపోయింది. ఏదైనా ఇంతకు ముందు వినని పాట వినిపిస్తే మళ్ళీ అదే శ్రధ్ధతో వింటోంది, అదీ తనకి నచ్చితేనే సుమా. పువ్వు, ఆకు, పాప, నవ్వు, నువ్వు, ఊయల లాంటి తన ప్రపంచం లోని పదాలున్నా, నారాయణ, గోవింద, రామ లాంటి తెలిసిన దేవుడి పేర్లు అక్కడక్కడా వినిపించినా తనకి పాట నచ్చే chances ఎక్కువ. సాధారణంగా పిల్లల పాటలు “చిట్టి చిలకమ్మా”, “చుక్ చుక్ రైలు వస్తోంది”, “ఏనుగెక్కి మనము ఏ ఊరెళదాము”, “కోడిపుంజు కోడిపుంజు టైమెంత టైమెంత” లాంటి పాటలు కూడా బాగానే వింటుంది కానీ అవి చిన్నవి కావడం వలన సమయమట్టే గడవదు, పని జరగదు. మీలో ఎవరైనా నేను మరచిపోయిన పాటల్ని గుర్తు చేసి పుణ్యం కట్టుకుంటారేమో అని ఈ టపా.

సహజ

నేను పాడిన, సహజ (ఒకప్పుడు) మెచ్చిన పాటలు –

సినిమా పాటలు-
“లాలీ .. లాలీ … లాలీ లాలి … వటపత్రశాయికి వరహాల లాలి” (స్వాతిముత్యం)
“జోలాలాలమ్మ జోలా” (సూత్రధారులు)
“లాలీ లాలీ.. అను రాగం సాగుతుంటే ఎవరూ నిదురపోరే.. చిన్నపోదా మరి.. చిన్నిప్రాణం” (ఇందిర)
“ఆమనీ పాడవే హాయిగా” (గీతాంజలి)
“తెలిమంచు కురిసింది తలుపు తీయనా (స్వాతికిరణం)
“చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ” (రోజా)
“చందమామ రావే జాబిల్లి రావే” (సిరివెన్నెల)
“సిరులొలికించే చిన్నినవ్వులే మణి మాణిక్యాలు” (యమలీల)
“సంతోషం సగం బలం హాయిగ నవ్వమ్మా” ( )
“సిరిమల్లె పూవల్లె నవ్వు” ( )
“లాలిజో లాలిజో ఊరుకో పాపాయి” ( ఏదో కమల్ హాసన్ సినిమా ?)
“ఎవరివమ్మా ఎవరివమ్మా ఏ దివ్యలోకాల దిగి ఈ అమ్మ ఒడిలోన ఒదిగి..” (??)
“మెల్లగా మెల్లగా తట్టి” (ఆశ ఆశ ఆశ)
“చుక్కల్లారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబిలి” (ఆపద్భాంధవుడు)

అన్నమయ్య కీర్తనలు –
“నారాయణతే నమో నమో”
“విన్నపాలు వినవలె వింత వింతలూ”
“భక్తి కొలది వాడే పరమాత్ముడూ”
“గోవింద గోవింద అని కొలువరే”
“ఇట్టి ముద్దులాడు వాడు యేడ వాడో వాణ్ణి పట్టితెచ్చి..”
“ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు”
“జో అచ్యుతానంద జో జో ముకుందా”

కృష్ణశాస్త్రి గారి పాటలు –
“ఆకులో ఆకునై”
“ఈ గడ్డి పూవులే”
“మనసు లోన కారుమబ్బు”
“ముందు తెలిసెనా ప్రభూ”

ఇంకా త్యాగరాజు, రామదాసుల కీర్తనలు ఒకటి రెండు ఇంతకు ముందు వినేది కాని, ఇప్పుడు దీర్ఘాలు నచ్చట్లేదు బుల్లి రాణీ వారికి. అలాగని “నే పాడితే లోకమే పాడదా” level పాటలు కూడా నచ్చట్లేదు. అదీ సంగతి. చిన్ని చిన్ని పదాలున్న మీకు నచ్చిన పాటలనైనా సరే, మీ పిల్లకాయల్తో పాటల పాట్లైనా ఇక్కడ share చేస్కుంటే నాక్కాస్త సాయం చేసిన వాళ్ళవుతారు 🙂

(p.s: ఈ బ్లాగు గత రెండేళ్ళుగా ఇంచుమించు మూతపడి ఉండటానికి కారణం మీకందరికీ తెలిసిపోయింది కదూ)

Posted in సహజ | Tagged , | వ్యాఖ్యానించండి

భక్తి…

పదాలకు చిక్కని అద్భుతమైన భావనేమో భగవంతుడంటే. వర్ణింపశక్యం కానిదైనా, పంచుతూపోతే అలౌకికానందాన్ని పెంచే అందం ఆ “భావన”కి ఉండబట్టేనేమో చాలా మంది కళాకారులు తమ తమ కళలలో దానిని వ్యక్తం చేయటానికి ప్రయత్నించారు, ప్రయత్నిస్తూ ఉన్నారు, ప్రయత్నిస్తూనే ఉంటారు. సకల గుణ సమ్మిళితమైన ఆ ఆనందార్ణవంలో ఏ కొన్ని తరంగాలకో స్పందించి తమ శక్త్యానుసారం సన్నుతించగలిగారు. సర్వ వర్ణ సంశోభితమైన ఆ నిర్వర్ణాన్ని తమకు నచ్చిన రంగుల్లో చిత్రించగలిగారు, సకల శబ్ద మాధుర్యాన్ని తనలో నిక్షిప్తం చేసుకున్న నిశ్శబ్దారామంలో భావకుసుమాలనల్లి గీతాంజలులర్పించారు, పాడారు, ఆడారు. చివరికి ఏ విధంగా వ్యక్తీకరించాలో తెలియనివాళ్ళు ఆ సంతోష సాగరాన్ని తమలోనే దాచుకోలేక ఏ బంధమూ లేని ఆ అనురాగ సింధువును తమకు ప్రియాతిప్రియమైన నేస్తం లాగ, తమ చుట్టూ తిరిగే చిన్నితండ్రి లాగ, మనోహరుడైన ప్రేమమూర్తి లాగ, చల్లగా లాలించే అమ్మ లాగ, చక్కగా పాలించే తండ్రి లాగ, జీవనసారధి అయిన సద్గురువులాగ భావించుకుని ఆ ప్రేమామృత ఝరికి తమదైన రూపాన్ని కల్పించుకున్నారు. ఎందరో ఎందరెందరో మహానుభావులు ఆ మహానుభవంలో ఆసాంతం కరిగిపోయారు, కలిసిపోయారు! నా మేధకి, ఊహకి, జ్నప్తికి అందగలిగిన అన్నింటిలోను నిండిపోయిన “ఆ భావన” నన్ను మాత్రం వేరుగా ఉంచింది ఆ అవ్యక్తానుభవాన్ని ఆస్వాదింపచేయడానికేనేమో.

Posted in నా రాతలు, భక్తి | 2 వ్యాఖ్యలు

మార్పు … నా లోనూ!

ప్రవహించే కాలంలో అన్నీ మారిపోతున్నాయి, అన్నింటితోపాటు నేనూను. ఇది వరకు చిన్ని చిన్ని ఆనందాలు, బుల్లి బుల్లి అందాలు మనసుకి నేరుగా తాకేవి, గిలిగింతలు పెట్టేవి, మనసంతా నిండిపోయేవి. ఎవ్వరికీ చెప్పకుండా ఉండలేనంతగా ఉబ్బితబ్బిబ్బు చేసేవి.. ఆనందాలే కాదు ఆవేశాలైనా, ఆవేదనలైనా అదే తీరు! మనలో చాలమందికి ఇది అనుభవమే.. అలా మనసు ఉండబట్టలేకపోతే లోపల్నుంచి “తవికలు” తన్నుకొచ్చేసేవి. బయటకి వచ్చేసిన భావాల్ని చూసుకుంటే ఎంతో హాయిగా అనిపించేది.. ఈ బ్లాగులో రాసినవన్నీ అలాంటివే.. ఇప్పుడు తవికలు నాకు ఠీ కొట్టాయి, దగ్గరకి రామని వెక్కిరిస్తున్నాయ్. నేనేం పాపం చేసానర్రా అని అడిగితే, అవి తిరిగి నన్ను ప్రశ్నించాయి-సంతోషాలు, సంబరాలు, కష్టాలు, కన్నీళ్ళు, జ్ఞాపకాలు, జాలి క్షణాలు అన్నీ అప్పుడూ ఉన్నాయి, ఇప్పుడూ ఉన్నాయి, కాని వాటిని మనసు తీరా అనుభవించే తీరికా, ఓపికా నీకెక్కడున్నాయమ్మా అని! నిజమేనేమో, ప్రశాంతంగా ఉండాల్సిన జీవితం గజిబిజికి, బిజి బిజికి తావిస్తోంది ఈ మధ్య. మళ్ళీ నా తవిక నేస్తాల అలక తీరేంతవరకు పచ్చి ఆలోచనల్ని పంచుకునేందుకు మానసవీణ తాపత్రయపడుతోంది. అదీ మార్పు సంగతి.

Posted in నా రాతలు | 1 వ్యాఖ్య

ఎక్కడికో ఈ పరుగు …

ఎక్కడికో ఈ పరుగు
ఎందుకో తెలియదు,
నీ పిలుపు వినిపించుకోకుండా…

నాకు తెలుస్తూనే ఉంది,
నువ్వు పిలుస్తున్నావని.
ఒక్క క్షణం ఆగి చూస్తాను
కాని మనసంతా పరుగు మీదనే,
మళ్ళీ నాకు తెలియకుండానే పరుగు మొదలవుతుంది
ఇప్పుడు ఇలా నీ నుంచి పరుగెత్తినా
ఎప్పటికైనా మరలా నిన్ను కలవాలని వెనుదిరిగి చూస్తాను
అప్పటికి ఈ పరుగు నన్ను ఎంత దూరం చేరుస్తుందో…
నువ్వు కనుచూపు మేరలో కనిపిస్తావో లేదో…

Posted in నచ్చిన కవితలు | 5 వ్యాఖ్యలు

అంతరావలోకనం

శ్వాస తెలిసే నిశ్శబ్దంలో
వెలుగే దూరని చీకటి గదిలో
లోలోపలి వెలుగుల కోసం
వెతుకుతున్న ఈ నా మదిలో
ఒక శాంతి కిరణం ఉదయించింది
ఒక కాంతి పుంజం నర్తించింది
ఆహా, ధన్యం నా ధ్యానం!
ఇదంతా ఒకే ఒక్క క్షణం!
మరుక్షణం అలోచనల అలలు,
మళ్ళీ వెదుకులాటలో నేను!

Posted in నా రాతలు, భక్తి | 2 వ్యాఖ్యలు